సాధారణంగా వీకెండ్ సెలవులు వస్తే ఎవరైనా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దీనికి చిన్నా, పెద్ద అనే తేడా ఉండదు. అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం వీకెండ్ సెలవులలో ఇంట్లో సేదతీరకుండా పొలం వైపు అడుగులు వేశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇద్దరూ తమ భార్యాపిల్లలతో కలిసి పొలంలో చెమట చిందించారు. రైతులతో పాటు వీళ్లు కూడా పొలంలో పనిచేశారు. ఈ సందర్భంగా బాపట్ల మండలం మురుకొండపాడు గ్రామ శివారులోని పొలాల్లో కలెక్టర్లు ఇద్దరూ నాట్లు వేశారు. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు కలెక్టర్లు పక్కపక్క జిల్లాలలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్లు పొలంలో పనిచేస్తున్న ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. అసలు కలెక్టర్లు ఉన్నపళంగా పొలాలకు ఎందుకు వెళ్లారో ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ దంపతులను వారి పిల్లలు వ్యవసాయం అంటే ఏంటి అని అడిగారు.

దాంతో వారు సమాధానం చెప్పకుండా క్యారేజీలు కట్టుకుని నేరుగా వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం నాట్లు సీజన్ కావడంతో పొలంలో దిగి వ్యవసాయం చేశారు. అంతేకాదు తమతో తెచ్చుకున్న భోజనాన్ని తింటూ అక్కడి ఉన్న వారికి పెడుతూ సందడి చేశారు. కాగా రెండు జిల్లాల కలెక్టర్లు తమతో కలిసి వరి నాట్లు వేయడం చూసిన రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ లుంగీ కట్టి వరి నాట్లు వేయడమే కాక పొలం గట్లపై రైతులతో కలిసి భోజనం చేసి కాసేపు వారితో ముచ్చటించారు. అటు కలెక్టర్లు పొలంలో దిగి పనిచేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్‌లు ప్రశంసిస్తున్నారు. ఢిల్లీకి రాజైనా భూమాతకు బిడ్డే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.