హసన్ జిల్లా దొడ్మగ్గే గ్రామానికి చెందిన మంజేగౌడ, లీలావతి దంపతులు ఓ దొంగ స్వామిజీ చేతికి చిక్కుకున్నారు. ఈ దంపతులను ఒక స్వామీజీ కలిసి వారి పొలంలో నిధి ఉందని చెప్పి నమ్మించాడు. తన దైవ శక్తిని ఉపయోగించి దానిని బయటకు తీస్తానని చెప్పాడు. ఆయన మాటలను వారు గుడ్డిగా నమ్మారు. అయితే వారిని మోసం చేయాలనుకున్న ఆ వ్యక్తి ముందుగానే వారి పొలంలో బంగారు పూత పూసిన ఓ మూడు కిలోల విగ్రహాన్ని పాతిపెట్టాడు. తర్వాత మంజేగౌడ, లీలావతిలను పొలానికి రమ్మన్నాడు. వారి ఎదుట ఏవో పూజలు నిర్వహించాడు. భూమిలో తను ముందుగా పాతిపెట్టిన విగ్రహాన్ని బయటకు తీశాడు. దానిని నీళ్లతో కడిగించి.. రక్తంతో అభిషేకించాలని చెప్పాడు.

దానికోసం లీలావతి వేలును కోసి ఆ వచ్చే రక్తంతో అభిషేకం చేశాడు. దీంతో ఆమె వేలు నరాలు తెగిపోయాయి. తమ కోసం ఇంత కష్టపడిన ఆ స్వామిజీకి దంపతులిద్దరూ రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే వారిద్దరూ కొన్ని రోజుల తర్వాత విగ్రహాన్ని ఓ వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి తనిఖీ చేయించారు. దాంతో అసలు బండారం బయటపడింది. అది వెండి విగ్రహం అని తేలింది. వెంటనే ఆ స్వామిజీకి ఫోన్ చేశారు. అప్పటికే ఆ దొంగ స్వామిజీ పరారైపోయాడు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.