రోజుకు 24 గంటలు విధుల్లో ఉండే పోలీసు కానిస్టేబుల్ ను తాను పెళ్లి చేసుకోనని ఓ అమ్మాయి తన తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. సదరు కానిస్టేబుల్ ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ లేఖ ద్వారా తెలిపాడు. సిద్ధాంతి ప్రతాప్ అనే యువకుడు చార్మినార్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇటీవల పెళ్లి చూపుల కోసం ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్లాడు. అయితే అబ్బాయి పోలీసు కానిస్టేబుల్ అని తెలుసుకున్న సదరు అమ్మాయి , 24 గంటల పాటు విధుల్లో ఉండే పోలీసును తాను పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది.

దీంతో నివ్వెరబోయిన సిద్ధాంతి ప్రతాప్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తు కమిషనర్ అంజనీకుమార్ కు లేఖ రాశాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తాను పోలీసు ఉద్యోగంపై ఇష్టంతో నాలుగేళ్ల క్రితం కానిస్టేబుల్ గా ఎంపికయ్యానని సిద్ధాంతి ప్రతాప్ తన లేఖలో పేర్కొన్నారు. కమిషనర్ కు రాసిన లేఖలతో పోలీసు వ్యవస్థలోని లోపాలను సిద్ధాంతి ప్రతాప్ ఎత్తి చూపాడు. 20ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ చాలా మంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ గానే మిగిలిపోతున్నారని, పదోన్నతులు లేవని , ఈ క్రమంలోనే తాను అన్ని ఆలోచించి కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశానని తన లేఖలో ప్రతాప్ పేర్కొన్నారు. అయితే సిద్ధాంతి ప్రతాప్ రాజీనామా లేఖను అంజనీకుమార్ ఇంకా ఆమోదించలేదని తెలిసింది.