చేయని తప్పుకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఈ విషాద సంఘటన జరిగింది. పోలీసుల తీరుపై మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అబ్బాయి తప్పు చేయలేదని చెప్పినా వినిపించుకోకుండా అదుపులోకి తీసుకొని వేధించడంతో మనస్థాపం చెందినట్టు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కళ్యాణ్, నాని, అశోక్, సాయి అనే నలుగురు యువకులు డబ్బుల కోసం ఇటీవల ఏటీఎం సెంటర్‌కు వెళ్లారు. ఏటీఎంలో డబ్బు లేకపోవడంతో మరో ఏటీఎంకు వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి ఎదురుకావడంతో కళ్యాణ్ కోపంతో ఏటీఎం మిషన్‌ను కాలితో తన్నాడు.

ఏటీఎం డబ్బా ఊడిపోవడంతో అతని స్నేహితుడు నాని పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు వచ్చేలోపే అక్కడి నుంచి నలుగురు యువకులు వెళ్లిపోయారు. ఏటీఎం పగిలిపోవడంతో పోలీసులు పెద్ద కేసుగా భావించి దర్యాప్తు చేపట్టారు. వారిని అదుపులోకి తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. అయితే పోలీసులు వేధింపులు తట్టుకోలేకనే కళ్యాణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.