లక్నవరం: ప్రకృతి అందాలతో అలరిస్తున్న లక్నవరం సరస్సు కొన్నేళ్ళ క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ సమయంలో నిరాదరణకు గురైంది. అయితే ప్రస్తుతం తెలంగాణ లోని ప్రధాన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. లక్నవరం సరస్సు దీవుల మధ్య వేలాడే ఈ వంతెనను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజూ వందలాదిమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సరస్సులో ఆరు దీవులు ఉండగా, ఒక్కో దీవిని ఒక్కోరకంగా ముస్తాబు చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు పర్యాటకశాఖ తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఇటీవల మరొక వేలాడే వంతెన ను ఏర్పాటు చేసి పర్యాటకులకు మరింత ఆకర్షించే విధంగా తయారు చేశారు.

2020 మార్చి 22 నుండి లాక్ డౌన్ కారణంగా లక్నవరం సరస్సుకు వచ్చే పర్యాటకులను అనుమతించడం లేదు. లక్నవరం సరస్సు చరిత్రలక్నవరం సరస్సు క్రీ.శ. 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయరాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. కళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కాకతీయ రాజులు, ఆనాటి రైతాంగంపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవారనేందుకు ఈ సరస్సు సాక్షీభూతంగా నిలుస్తోంది. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్‌ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది. కోనేరు, దేవాలయం, నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో శివాలయం, నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును మాత్రమే నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత.

ఈ సరస్సుకు తొమ్మిది ప్రధాన తూములు ఉన్నాయి. కాంక్రీటు, ఇనుము వాడకం లేకుండా కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకపోవటం విశేషంగా చెప్పవచ్చు. కాకతీయుల కాలం నుండి నేటివరకు లక్నవరం సరస్సు రైతులపాలిట వర్రపదాయినిగా ఉంటోంది. 8,700 ఎకరాల పంటపొలాలను సంవత్సరం పొడవునా నీరందిస్తోంది. సరస్సు నిర్మాణం సమయంలోనే సాగునీటి కోసం రంగాపుర్‌, శ్రీరాంపతి, నర్సింహుల కోట అనే నాలుగు ప్రధాన కాల్వలను నిర్మించారు. ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం లోతట్టు ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ఈ సరస్సు నిండుతుంది. 9 ప్రధాన తూముల ద్వారా నీటిని విడుదల చేసి సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్‌లో నిల్వచేస్తారు. అక్కడి నుండి కాల్వల ద్వారా ఆయకట్టు పొలాలకు నీటిని అందిస్తారు.