తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సిబ్బందికి మొదటి విడతగా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్, మొదటి విడత వ్యాక్సినేషన్ లో ప్రజాప్రతినిధులు టీకాలు వేయించుకోవడం లేదని తెలిపారు. కరోనాపై ముందుండి పోరాడిన వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్.

టీకా తీసుకునేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నా, ప్రధాని సూచనలు పాటించాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే తాము కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటామన్నారు. తిలక్ నగర్ లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. కరోనా వ్యాక్సిన్లు ఎంతో సురక్షితమైనవని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.