{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584115379732","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584115379695","source":"other","origin":"gallery"}

రంగారెడ్డి జిల్లా మొత్తం దాదాపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉండటంతో జిల్లా పరిసరాల్లో ఎన్నో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. అంతకుముందు ప్రభుత్వాల హయాంలో ఇలాంటి భూములను కొందరు రాజకీయ నాయకులు లీజుల పేరుతో అప్పనంగా ఆక్రమించుకోగా, మరికొందరు బడా వ్యాపారులు మాత్రం ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆ భూముల్లో తిష్ట వేశారు. వారిలో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉండటంతో అప్పట్లో ఏ అధికారి కూడా ఆ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోలేదు కదా వాటిని కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఇటీవలే జిల్లాకు వచ్చిన కలెక్టర్ అమయ్ కుమార్ ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. 

జిల్లాలో ప్రభుత్వ భూములు కొన్ని కోట్ల రూపాయల విలువ చేయటంతో చాల మంది పెద్దల కన్ను వీటిపై ఉంది. అందుకే ప్రభుత్వం వీటి రక్షణకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఇప్పటికే లీజు దాటిపోయి ఇంకా ఆ భూముల్లో తిష్ట వేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపట్ల కొరడా జుళిపిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని నిత్యం అప్రమత్తం చేస్తూ ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా విలువైన భూముల రక్షణ దిశగా అడుగులు వేస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లా మొత్తం కలియతిరుగుతూ ప్రభుత్వ భూముల సర్వే దిశగా రంగం సిద్ధం చేసి ఆ భూములు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో రెవెన్యూ యంత్రాంగంతో ఒక నివేదిక తయారుచేసి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఇప్పటికే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తీసుకుంటున్న చర్యలపై రంగారెడ్డి జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.