ఒడిశాలో రైలు ప్రమాద ఘటన ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికీ 280 పైగా ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఇదే కాకుండా 900 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో పాటు రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండడం కంటతడి పెట్టిస్తుంది. అయితే, సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి అసలు కారణాలు అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరి కొందరు మాత్రం ఈ ప్రమాదం కక్ష్య పూరితంగానే చేశారని మరికొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘోర రైలు ప్రమాద ఘటనపై కర్ణాటక బీజేపీ మహిళా నాయకురాలు హెచ్ఎస్. శకుంతల ఇటీవల సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు. ఈ ప్రమాదానికి అక్కడ మసీదు ఉండడమే ప్రధాన కారణమైనట్లుగా ఆమె తన పోస్టులో రాసుకొచ్చినట్లు తెలుస్తుంది.

అయితే ఆ పోస్ట్ ను ఆమె అప్పటికే డిలీట్ చేశారు. కానీ, కొందరు ఆ పోస్ట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫొటో మరింత వైరల్ గా మారింది. దీంతో ఒడిశా పోలీసులు వెంటనే స్పందించారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్చలు తీసుకుంటామని తెలిపారు. ఇకపోతే, రైలు ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్నది మసీదు కాదని, ఇస్కాన్ టెంపుల్ అని వివరణ ఇచ్చారు. కావాలనే కొందరు వ్యక్తులు గుడి సగం ఫొటోను తీసి మసీదుగా చిత్రీకరించి అల్లర్లు సృష్టించడానికి పని గుట్టకున్నారని, అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఒడిశా పోలీసులు ట్విట్టర్ లో ఓ ప్రకటన కూడా చేశారు. దీంతో పాటు కర్ణాటక బీజేపీ లీడర్ హెచ్ఎస్.శకుంతల తప్పుడు సమాచారం పోస్ట్ చేసినందుకు ఒడిశా పోలీసులు వద్ద వివరణ కూడా తీసుకోనున్నట్లు సమాచారం.