మానవ వనరుల అభివృద్ధి లో ప్రధాన పాత్ర వహించే విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తూ పెద్ద ఎత్తున నిధులను కేటాయించి విద్యా, వైద్య రంగాలలో అభివృద్ధి చేస్తున్నాదని, ఈ కృషిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హైదరాబాదులోని గచ్చిబౌలి లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IIIT, హైదరాబాద్)లో అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సహకారంతో ఆదివారం నాడు జరిగిన గ్లోబల్ కల్చర్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రముఖ కూచిపూడి కళాకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మజా రెడ్డిని సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టి అమెరికా, ఇతర దేశాలలో ఉన్నత హోదాలో ఉన్న ఇంజనీర్లు, తాము పుట్టిన నేలకు సేవ చేయాలని ఆయన కోరారు.

అందులో భాగంగా వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వైద్యరంగ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటుగా, అనుబంధంగా టీచింగ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాదని తెలిపారు. వరంగల్ నగరంలో 1100కోట్ల రూపాయల వ్యయంతో 34 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయబడుతుందని, ఈ ఆస్పత్రిలో అందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు కల్పించబడతాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప పద్మశ్రీ అవార్డు లభించిన మొదటి మహిళా డాక్టర్ పద్మజా రెడ్డి కావడం అభినందనీయమైన విషయమన్నారు. ఐదేళ్ల వయసులోనే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్న పద్మజా రెడ్డి దాదాపు యాభై ఏళ్ళు నిరంతరంగా కృషి చేస్తూ దేశ, విదేశాలలో తాను, తన శిష్యులతో, తన గురువైన శోభానాయుడు తో కలిసి దాదాపు మూడు వేలకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారని ప్రశంసించారు.

తాను నమ్మిన కళ కోసం ఆమె చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. డాక్టర్ పద్మజా రెడ్డి గత 50ఏళ్లుగా కూచిపూడి కళా రంగానికి ప్రాధాన్యతనిస్తూ దాదాపు మూడు వేల ప్రదర్శనలు ఇవ్వడం శ్లాఘనీయమని ప్రముఖ కవి, గాయకులు, సాహిత్య అకాడమీ గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలంగాణ సంఘం అధ్యక్షుడు నరేందర్, ప్రధాన కార్యదర్శి ఎం వెంకట్, గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్, ఇండియా అడ్వైజర్ బి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.