ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ప్రమోషన్లు రాక కలతచెందే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రిజర్వేషన్లకు లోబడి ప్రమోషన్లు చట్ట విరుద్ధమని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సీనియారిటీకి అనుగుణంగా ప్రమోషన్లు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. సీనియారిటీ, పనిలో నైపుణ్యాన్ని పక్కనపెట్టి రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రమోషన్లు వల్ల తాము నష్టపోతున్నామని పిటిషన్‌దారులు వాపోయారు.

పదోన్నతులు కల్పించడంలో కూడా రిజర్వేషన్లను అమలుచేయడం చట్టవిరుద్దమని 2015లో కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. అయితే ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో, తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల (పనుల నిబంధన) చట్టంను రాష్ట్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ద్వారా రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని, సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో మరో పిటిషన్‌ వేశారు.

ప్రమోషన్లు విషయంలో సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకోవాలని న్యాయమూర్తులు తమ తీర్పులో స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు అనుగుణంగా పదోన్నతులు కల్పిస్తే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల శాతం మించిపోతోంది, తమిళనాడు రిక్రూంట్‌మెంట్‌ బోర్డు 2003 నుంచీ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని న్యాయమూర్తులు అన్నారు. అందుకే రిజర్వేషన్లకు అనుగుణంగా పదోన్నతులు కల్పించడాన్ని మద్రాసు హైకోర్టు రద్దు చేసినట్లు తెలిపారు. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిర్ధారించిందని న్యాయమూర్తులు వివరించారు. ఈ దశలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను కాదని తమిళనాడు ప్రభుత్వం 2016లో కొత్తచట్టాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్లకు అనుగుణంగానే పదోన్నతులను కల్పిస్తోందని వారు తెలిపారు.