కన్నతల్లిదండ్రులపైనే హత్యానేరం పెట్టిన ఓ కొడుకు విచిత్ర కథ ఇది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి, తన భార్యను దారుణంగా చంపేశారని, అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని వాదిస్తున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
31ఏళ్ల నరేంద్ర వర్మ, 2013లో తన స్నేహితురాలు అరుంధతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం నరేంద్ర తల్లిదండ్రులకు ఇష్టంలేదు. అప్పటినుంచి ఆయన ఉద్యోగ నిమిత్తం భార్యతో కలసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వద్ద కన్సల్టెంట్ గా పనులు చేస్తున్నాడు. అయితే ఈ ఏడాది హోలీ పండగను తల్లిదండ్రులతో కలసి చేసుకునేందుకు ఇంటికొచ్చాడు నరేంద్ర, భార్య అరుంధతిని కూడా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సెకండ్ వేవ్ ఉధృతం కావడంతో లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అప్పటికి తన భార్య, తన తల్లిదండ్రులతో కలసి ఉండలేకపోతుందనే విషయాన్ని గ్రహించాడు నరేంద్ర.

లాక్ డౌన్ కారణంగా వారిద్దరూ ఎక్కడికి వెళ్లలేకపోయారు. ఓరోజు నరేంద్ర మార్నింగ్ వాక్ కి వెళ్లగా, ఇంటి పక్కన ఉన్న వ్యక్తి అతని తండ్రికి ఫోన్ చేశాడు. నరేంద్ర అటు వెళ్లాడో లేదో ఆయన తండ్రి ఇంటికొచ్చాడు, నరేంద్ర తల్లి ఉన్నట్టుండి కోడలితో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో నరేంద్ర తండ్రి కోడలిపై గొడ్డలితో దాడి చేశాడు. గొంతు తెగ నరికాడు. నరేంద్ర తమ్ముడు కూడా తండ్రికి సాయపడ్డాడు. పదునైన ఆయుధంతో వదినపై దాడి చేశాడు. అక్కడే కుప్పకూలిపోయింది అరుంధతి. నరేంద్ర రాగానే దాన్ని ఓ గొడవగా చిత్రీకరించాలని చూశారు. స్థానిక పోలీసులకి కూడా గొడవలో ఆమె పొరపాటున గొడ్డలిపై పడిపోయిందని చెప్పారు. అయితే నరేంద్ర మాత్రం తన తల్లిదండ్రులే హంతకులని, కోడల్ని పొట్టనపెట్టుకున్న వారిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాడు.