ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. చివరికి ప్రాణ స్నేహితులు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఫ్రెండ్ అని నమ్మితే అడ్డంగా దగా చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నారు. ప్రాణ స్నేహితుడు అని నమ్మిన కారణంగా ఓ వ్యక్తి చాలా నష్టపోవాల్సి వచ్చింది. తన భార్యకి దూరం కావాల్సి వచ్చింది. స్నేహితుడే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసిన ఆ భర్త తీవ్ర ఆవేదన చెందాడు. ఇది సరికాదని ఇద్దరికీ చెప్పాడు. అయినా ఎవరూ వినలేదు. చివరికి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ప్రాణ స్నేహితులు పైగా ఒకే ఊరు:

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు సమీపంలోని దేవలాపురం గ్రామపంచాయితీ పరిధిలోని రామాపురంలోని ఎట్టియమ్మాన్ వీధిలో మణికందన్, అభిరామి దంపతులు నివాసం ఉంటున్నారు. మణికందన్ ఎలక్ట్రీషియన్. మణికందన్ చిన్ననాటి స్నేహితుడు రాజేష్ సైతం రామాపురం ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడు. రాజేష్ కు భార్య, పాప ఉన్నారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు, పైగా ప్రాణ స్నేహితులు. దీంతో మణికందన్, రాజేష్ కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళుతుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత అసలు కథ మొదలైంది.

ఒకే కంపెనీలో ఉద్యోగం:

మణికందన్ భార్య అభిరామి, రాజేష్ అంబూరులోని ఓ ప్రైవేట్ షూ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేష్, అభిరామి ఒకే బైక్ లో ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నారు. తన భార్య అభిరామిని బైక్ లో తీసుకెళ్తున్నది తన ప్రాణస్నేహితుడు కావడంతో మణికందన్ కు ఏమాత్రం అనుమానం రాలేదు. ఇదే సమయంలో రాజేష్ కన్ను ఫ్రెండ్ మణికందన్ భార్యపై పడింది. ఆమెని లొంగదీసుకున్నాడు. ఇది తప్పు అని తెలిసినా అభిరామి కూడా రాజేష్ కి లొంగిపోయింది.

స్నేహితుడి భార్యని లొంగదీసుకున్నాడు:

ఇంటి నుంచి ఉద్యోగానికి బైక్ లో వెళుతున్న రాజేష్, అభిరామి నేరుగా కంపెనీ దగ్గరకు వెళ్లకుండా అక్కడక్కడ నిలిపి ఎంజాయ్ చెయ్యడం, రాత్రి లేటుగా ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఈ విషయం ఇతరుల ద్వారా భర్త మణికందన్ కు తెలిసింది. భార్య అభిరామి ప్రవర్తన మీద అతడికి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను మణికందన్ నిలదీశాడు. అయితే అభిరామి భర్త మణికందన్ మాటలు లెక్క చెయ్యలేదు. భార్య అభిరామిని ఎన్నిసార్లు మందలించినా ఫలితం లేకపోవడంతో మణికందన్ రగిలిపోయాడు

బెడ్ రూమ్ లో అసభ్యకర రీతిలో అడ్డంగా దొరికిపోయారు:

ఓ రోజు మణికందన్ ఇంటికి వచ్చే సరికి బెడ్ రూమ్ లో అభిరామి, రాజేష్ అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో ఇద్దరిని చంపేందుకు మణికందన్ ప్రయత్నించగా, ఇకపై తాము బంధాన్ని కొనసాగించబోమని వారిద్దరూ చెప్పడంతో మణికందన్ వదిలిపెట్టాడు. కొన్నిరోజుల పాటు దూరంగా ఉన్న అభిరామి మళ్లీ ప్రియుడు రాజేష్ తో మాట్లాడటం మొదలు పెట్టింది. శనివారం రాత్రి భార్య అభిరామి వీడియో కాల్ లో రాజేష్ తో మాట్లాడుతోంది. ఇది గుర్తించిన భర్త మణికందన్ మరింత రగిలిపోయాడు. వెంటనే క్యాన్ లో 5 లీటర్ల పెట్రోల్ తీసుకుని నేరుగా రాజేష్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఓ గదిలో అభిరామితో ఫోన్ లో మాట్లాడుతున్న రాజేష్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన మణికందన్ ఇంటి బయట గడియ పెట్టాడు.

తన భార్యని లొంగదీసుకున్న స్నేహితుడి తగలబెట్టాడు:

నువ్వు నా భార్యతో వీడియో కాల్ లో మాట్లాడుతూ యుముడి దగ్గరకు వెళ్లిపోరా అంటూ మణికందన్ గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు రాజేష్ ను అంబూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 90 శాతం కాలిన గాయాలు కావడంతో రాజేష్ చనిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు మణికందన్ ను అరెస్ట్ చేశారు. మణికందన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కాగా, తన భార్య ప్రియుడిని చంపేశానని, త్వరలో జైలు నుంచి బయటకు వచ్చి తనను మోసం చేసిన తన భార్య అభిరామిని కూడా లేపేస్తానని మణికందన్ ఆవేశంతో ఊగిపోతున్నాడట.