నటి ప్రియమణికి అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వెంకటేశ్‌-ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. ధనుష్‌ కథానాయకుడిగా తమిళంలో మంచి విజయం సాధించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘నారప్ప’ తెరకెక్కుతోంది. గురువారం ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను వెంకటేశ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఇందులో ప్రియమణి సుందరమ్మగా కనిపించనున్నారు.

‘హ్యాపీ బర్త్‌డే ప్రియమణి. ఈ రోజు నీకు అద్భుతంగా ఉండాలని, అలాగే ఈ ఏడాది అంతా నీకు మంచి విజయాలు వరించాలని కోరుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.