హైదరాబాద్‌ నగర పరిధిలోని షాద్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చటాన్‌పల్లి వంతెన వద్ద ప్రియాంకరెడ్డి(22) అనే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తండ్రి శ్రీధర్‌రెడ్డి అక్కడికి వెళ్లి మృతదేహాన్ని తన కుమార్తె ప్రియాంకరెడ్డిగా గుర్తించారు.

మృతురాలి కుటుంబం ప్రస్తుతం శంషాబాద్‌లో నివాసముండగా ఆమె నవాబ్‌పేట మండలం కొల్లూరులో వెటర్నరీ వైద్యురాలిగా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదని ఆమె తండ్రి తెలిపారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు: ప్రియాంక తన తండ్రి శ్రీధర్‌రెడ్డికి ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి బుధవారం ఉదయం బయల్దేరింది. రాత్రి తన సోదరికి ఫోన్‌ చేసి భయమేస్తుందని చెప్పింది. తన బైక్‌ పంక్చర్‌ అయ్యిందని, తన చుట్టూ కొందరు లారీ డ్రైవర్లు ఉన్నారంటూ చెప్పి ఫోన్‌ పెట్టేసింది. ఆమె సోదరి అందించిన వివరాల ప్రకారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 15 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ తెలిపారు.