ప్రేమించిన యువకుడితో పెళ్లి చేసేందుకు తాను రెండేళ్లు ఆగలేనంటూ ఓ బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది . ఈ ఘటన ఫలక్ నుమా పోలీస్టేషన్ పరిధిలో జరిగింది . ఫలక్ నుమాలో నివసించే ఓ బాలిక పదో తరగతి చదువుతోంది . కొంతకాలంగా సదరు బాలిక ఓ యువకుడిని ప్రేమిస్తోంది . తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేయాలని కోరింది . అయితే మైనర్ కావడంతో రెండేళ్లు ఆగితే ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేస్తామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు . తల్లిదండ్రుల మాటలను కాదని.

ఈనెల 20న ఓ ఖాజీని కలిసి తన ప్రియుడితో పెళ్లి చేయాలని కోరింది . అయితే మైనర్ కావడం వల్ల తాను పెళ్లి చేయలేనని , రెండేళ్లు ఆగాలని ఆ బాలికకు ఖాజీ తేల్చి చెప్పాడు . రెండేళ్ల తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదని , తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి జరుగుతుందో తెలియదన్న బాధతో మనస్తాపం చెందిన సదరు బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది .

తన పెళ్లి జరగనందున ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సదరు బాలిక సూసైడ్ నోట్ లో పేర్కొంది. సారీ డాడీ, సారీ మమ్మీ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది . పోస్టుమార్టం కోసం సదరు బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు . ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు .