తనకల్లుకు చెందిన రమేష్‌కు 13 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా మొలకలచెరువు సమీపంలోని దండువారిపల్లికి చెందిన రేణుకతో వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల మనోజ్, ఎనిమిదేళ్ల లక్కీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం వీరు అనంతపురంలోని రాణి నగర్‌కు మకాం మార్చి పాతూరు మార్కెట్ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రమేష్ తాగుడుకు బానిసయ్యాడు. భర్త తాగుడు మాన్పించేందుకు ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా అతని మార్పు రాలేదు. ఈ క్రమంలోనే నెలన్నరగా ఆమెకు రమేష్ దూరంగా ఉంటూ వచ్చాడు.
దీనిని నగరంలోని ఖాజానగర్‌కు చెందిన కుమారస్వామి అనే యువకుడు అవకాశంగా మలుచుకున్నాడు. రేణుకతో చనువు పెంచుకుని ఆమెతో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఏం జరిగిందో ఏమో బుధవారం అర్ధరాత్రి రేణుక(28) తన ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గుర్తించిన ఆమె అన్న రెడ్డప్ప వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో, కుమారస్వామి తన సోదరి గొంతు నులిమి హతమార్చాడంటూ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై సీఐ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.