భర్త మరో అమ్మాయితో చనువుగా ఉన్నాడని తెలిస్తేనే తట్టుకోలేదు భార్య. అలాంటిది మరో పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తుందా? కానీ, ఇక్కడ సీన్ రివర్స్. భర్తకు ప్రియురాలిని ఇచ్చి భార్య దగ్గరుండి పెళ్లి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో జరిగింది. టిక్‌టాక్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా వెతుక్కుంటూ వచ్చిన యువతితో తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసింది. ఈ అరుదైన వివాహం గురించి తెలుసుకుందాం రండీ డక్కిలి మండలం అంబేద్కర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. టిక్‌టాక్‌లో విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడగా ఇద్దరి మనసులు కలిశాయి. ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు ఆ తర్వాత యువతి నుంచి యువకుడు దూరమయ్యాడు.
కొద్దిరోజులు తర్వాత మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు. ఇంతలో ప్రియుడి కోసం కొన్నాళ్లు వేచిచూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి వచ్చింది. తన ప్రియుడికి ఇప్పటికే పెళ్లి జరిగిన విషయం తెలిసి బాధపడింది. కానీ, ఆ యువతి అంతటితో ఆగిపోలేదు తన ప్రేమికుడి భార్యను కలిసి మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని అందరం కలిసి ఉందామని నచ్చజెప్పింది. మొదటి భార్యకు ఏం చేయాలో పాలుపోలేదు. తొలుత అయోమయంలో పడినా చివరకు ముగ్గురూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి భార్య ఒప్పుకుంది. దీంతో భర్తతో కలిసి ప్రియురాలు పెళ్లి పీటలెక్కింది. భార్యే దగ్గరుండి భర్తతో ప్రియురాలికి వివాహం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.