వరంగల్‌: నాలుగేళ్ల పాటు తనను ప్రేమించి, చెట్టాపట్టాలేసుకు తిరిగి, ఇప్పుడు పెళ్లిని కాదన్నదన్న అవమానంతో ఓ యువకుడు, తన ప్రియురాలి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. సమ్మక్కఉ సారలమ్మ తాడ్వాయి మండల పరిధిలో కాల్వపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, చల్వాయికి చెందిన జక్కుల మహేందర్‌ (25) అనే యువకుడు, కాల్వపల్లికి చెందిన ఓ యువతి గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. విషయం తెలుసుకున్న ఇరువురి బంధువులు, పెద్ద మనుషులు కూడా అంగీకరించారు. అమ్మాయిని పిలిపించి మాట్లాడేసరికి, తాను మహేందర్‌ ను లవ్ చేయలేదని, పెళ్లి చేసుకోబోనని ఆమె తెగేసి చెప్పింది. దీంతో తనకు అవమానం జరిగిందన్న మనస్థాపంతో, అమ్మాయి ఇంటికి వెళ్లిన మహేందర్, అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును విచారిస్తున్నట్టు తెలిపారు.