ప్రేమించిన యువతి వదిలేసింది అతడు పిచ్చి వాడైపోయాడు, అమ్మాయి మోసంతో అతడికి సమాజంమీదే ద్వేషం ఏర్పడింది. బంగారంటి ఉద్యోగమేకాదు , అతడి జీవితమే నాశనం అయిపొయింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేసిన అతడి జీవితం రోడ్డుపాలైంది. హైదరాబాద్‌ తిరుమల గిరికి చెందిన రక్షక్‌రాజు దీన గాథ ఇది.

ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న రాజు గత కొన్ని రోజులుగా బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 3 లోని సిగ్నల్‌ వద్ద మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఇవాళ ఉదయం రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తూ వాళ్లపై రాళ్లతో రక్షక్‌రాజు దాడికి యత్నించాడు. దీంతో భయాందోళనలకు గురైన జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న పోలీసులపైనా అతడు దాడికి పాల్పడ్డాడు. కొద్దిసేపు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో రాజును తాడుతో కట్టేసి ఆటోలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రేమలో విఫలమై ఇలా పిచ్చిగా వ్యవహరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అనంతరం అతడిని బంజారాహిల్స్ పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు.