వేర్వేరు చోట్ల ప్రేమికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నా, జీవిత పయనాన్ని సాగించలేక ముందే ముగించుకుంది. పెద్దలు వ్యతిరేకించడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సమాచారంతో నీ వెంటే నేనూ అంటూ ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే: ఈరోడ్‌ జిల్లా అందియూరు సమీపంలోని ఒరుచ్చేరికి చెందిన ఇలంగోవన్‌(23), తిరుచంగోడుకు చెందిన రమ్య(23) ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నా ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా అందియూర్‌లో కాపురం ఉంటున్నారు.

ఈ పరిస్థితుల్లో సోమవారం పని ముగించుకుని ఇంటికొచ్చిన ఇలంగోవన్, రమ్య ఉరి వేసుకుని మృతిచెందడం చూసి ఆందోళన చెందాడు. తాను సైతం అంటూ ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఈ ఇద్దరూ ఇంటినుంచి బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకుని ఉండడం వెలుగుచూసింది. ఉదయాన్నే ఇలంగోవన్‌ తనను తిట్టడంతో రమ్య తీవ్ర మనస్తాపానికి లోనైనట్టు విచారణలో తేలింది. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం, భయంతో ఇలంగోవన్‌ సైతం బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ప్రియురాలి మరణంతో:

చెన్నై తండయార్‌ పేటకు చెందిన కుమార్‌ కుమార్తె దివ్య(20), పాత చాకలి పేటకు చెందిన పెరుమాల్‌ కుమారుడు అయ్యప్పన్‌(21) ప్రేమలో పడ్డారు. అయితే, వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. పెద్దలు మందలించడంతో దివ్య మనస్తాపం చెంది ఆదివారం అర్ధరాత్రి బలన్మరణానికి యత్నించింది. ఆమెను కీల్పాకం ఆస్పత్రికి తరలించగా, సోమ వారం మృతిచెందింది. విషయం తెలిసి తీవ్ర మనోవేదనలో పడ్డ అయ్యప్పన్‌ నీ వెంటే నేనూ అంటూ సోమవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ కోసం పిల్లలు బలన్మరణానికి పాల్పడడం వారి తల్లిదండ్రుల్ని, కుటుంబీకల్ని విషాదంలోకి నెట్టింది.