ప్రియురాలు ఈ లోకాన్ని వీడిపోయిందనే విషాదాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. ఆమెలేని ప్రపంచంలో‍ తను మనలేనని అనుకున్నాడు. ప్రేయసి ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో తానూ బలవన్మరణానికి ఒడిగట్టాడు. చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి, రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం:

సికింద్రాబాద్‌ మారేడుపల్లికి చెందిన తంగళపల్లి రాములు కుమారుడు బాలకష్ణ (19) ప్రైవేటు ఉద్యోగి. అతనికి ధూల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడింది. సదరు యువతిని స్నేహితురాలిగా తమకు పరిచయం చేసినట్టు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

అయితే శనివారం ఉదయం తాను ప్రేమించిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఆమె లేనిది నేను కూడా బతుకలేనని కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. కొద్ది సమయంలోనే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన బాలకష్ణ ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ చివరన పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకృష్ణ మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ధూల్‌పేట ప్రాంతానికి చెందిన ఒక యువతిని తమకు పరిచయం మాత్రమే చేశాడని సదరు యువతి ఎవరో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తమ కుమారుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తెలియదని బాలకృష్ణ కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.