ప్రియురాలు వేరొకరితో సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆగ్రహంతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దేశరాజధాని డిల్లీలో ఆమెపై హత్యాయత్నం చేశాడో వ్యక్తి. విచక్షణా రహితంగా ఆమెను కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళితే… ఢిల్లీలోని మునిక్రాకు చెందిన వరుణ్‌పాండే గడచిన ఎనిమిదేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తడంతో ఆమె వరుణ్‌ను వదిలేసి వేరుగా ఉంటోంది. ప్రియురాలు తనను విడిచిపెట్టడానికి కారణం ఆమె మరొకరితో సంబంధం కొనాసాగించడమే అన్న అనుమానంతో వరుణ్‌ ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం కుమార్తెను పాఠశాల నుంచి తీసుకురావడానికి వెళ్లిన ఆమెను అడ్డగించి కత్తితో పలుమార్లు పొడిచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రక్తం మడుగులో కుప్పకూలిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రేయసిపై అనుమానంతోనే అతను ఇంత ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.