బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట మరణంలో ఏకమయ్యారు. ప్రేమ పెళ్లికి అంగీకరించని పెద్దలు ఇద్దరినీ ఒకే గోతిలో పూడ్చిపెట్టి వారికి కన్నీటీ వీడ్కోలు పలికిన హృదయ విదారకర సంఘటన ఆదివారం కథలాపూర్‌ మండలంలోని రాజారాం తండాలో జరిగింది.

కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు: మండలంలోని రాజారాం తండాకు చెందిన భూక్య శిరీష, లకావత్‌ మహిపాల్‌ పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. శిరీష తల్లిదండ్రులు ఇటీవలే వేరే యువకుడితో పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ప్రేమికులు ఇద్దరు తీవ్రమనస్తాపానికి గురయ్యారు. పెద్దలను ఎదురించలేక, ప్రేమ పెళ్లి చేసుకోలేక చావే శరణ్యమని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో కరీంనగర్‌లో చదువుతున్న మహిపాల్‌ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన శిరీష, మహిపాల్‌లు శనివారం సిరికొండ శివారులోని అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరికి ఆదివారం బంధువులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపారు. ఇద్దరిని ఒకే గోతిలో ఖననం చేశారు. బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట చివరికి మరణంలో ఏకం కావడం, వారిద్దరిని కూడా ఒకే గోతిలో ఖననం చేసిన హృదయ విదారకర సంఘటన ప్రతీ ఒక్కరిని కలిచివేసింది…