కరీంనగర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారమే భార్య తన తల్లితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. రామగుండంలోని ఆటోనగర్‌కు చెందిన మహ్మద్‌ అజీంఖాన్‌ (36) హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న తల్లీకూతుళ్లను అరెస్ట్‌ చేశారు. కేసు వివరాలను సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు. అజీమ్‌ఖాన్‌ అదే ప్రాంతానికి చెందిన గరిశ శ్రావణిని 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అజీంఖాన్‌ కూలీగా శ్రావణి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో శ్రావణి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు భర్త అనుమానించాడు. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

దీంతో అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఒకసారి ఇటుకతో దాడి చేసింది. మరోసారి యాసిడ్‌ పోసేందుకు యత్నించగా తప్పించుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు గొడవపడ్డారు. వీధిలోకి వచ్చిన అజీంఖాన్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి కిందపడేసి గొంతుపై కాలితో తొక్కింది. శ్రావణి తల్లి నర్మద అజీంఖాన్‌ కాళ్లు గట్టిగా పట్టుకుంది. పక్కనే ఉన్న క్రికెట్‌ బ్యాట్‌తో ఛాతిపై బలంగా కొట్టడంతో అజీంఖాన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అజీంఖాన్‌ సోదరుడు నదీమ్‌ఖాన్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి శ్రావణితోపాటు ఆమెకు సహకరించిన ఆమె తల్లి నర్మదను అరెస్టు చేశామని తెలిపారు. తండ్రి హత్యకు గురికావడం తల్లి శ్రావణి, అమ్మమ్మ నర్మద జైలు పాలుకావడంతో వారి ఇద్దరు కుమారులు హమాన్, హర్మాన్‌ అనాథలుగా మారారు.