ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తిపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ కూతురుతో కలిసి ప్రియుడి ఇంటి ఎదుట సోమవారం ఆందోళన చేసింది. బాధితురాలి కథనం మేరకు: నిడమనూరు మండలం మాడ్గులపల్లికి చెందిన దర్శనం బేబీరాణి మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుండగా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కారింగుల శ్రీనుతో 2012లో పరిచయం ఏర్పడింది. బేబీరాణి 2015లో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుండగా అక్కడే విద్యాసంస్థలో పీఈటీగా పనిచేస్తున్న శ్రీను ఆమెను కలిసాడు. ప్రేమ విషయం తెలిసి 2016లో నిడమనూరులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా శ్రీను ఆమెకు దూరంగా ఉండాలని సూచించారు. శ్రీను 2018లో బేబీరాణిని ఒప్పించి గుడిలో వివాహం చేసుకున్నాడు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోవడం లేదని, పిల్లలు పుడితే వాళ్లే ఒప్పుకుంటారని నమ్మించాడు.

దీంతో బేబీరాణి 2020లో పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి శ్రీను తనకు ముఖం చాటేసి రెండో పెళ్లి చేసుకున్నాడని బేబీరాణి వాపోయింది. తనకు న్యాయం చే యాలని కోరుతూ బంధువులతో కలిసి శ్రీను ఇంటి ఎదుట ఆందోళనకు దిగినట్లు వివరించింది. కాగా, ఆ సమయంలో శ్రీను, అతడి తండ్రి ఇంట్లో లేరు. తన కుమారుడికి బేబీరాణితో ఎలాంటి సంబంధం లేదని శ్రీను తల్లి తెలిపింది. విషయం పోలీసులకు తెలపడంతో ఏఎస్‌ఐ జోజి వచ్చి పోలీస్‌స్టేషన్‌లో సమస్య పరిష్కరించుకోవాలని సూచించడంతో బేబీరాణి ఆందోళన విరమించింది.