ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆనందంగా సాగిపోతున్న జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. భర్త ప్రవర్తనలో మార్పు చోటుచేసుకుంది. రోజు తాగొచ్చి ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలను రైలు కింద పడేసి, తానూ రైలు కిందకు దూకింది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగింది. వివరాలు: కమాన్‌పూర్‌ మండలం జూలపల్లికి చెందిన అరుణ(31), యైటింక్లయిన్‌కు చెందిన జంగేటి ప్రవీణ్‌లు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు సాత్విక్(5), సాత్విక(2) ఉన్నారు. పెళ్లైన మొదట్లో వీరి జీవితం బాగానే సాగింది. అయితే గత కొంతకాలంగా ప్రవీణ్ మద్యానికి బానిసయ్యాడు. పుట్టింటికి వెళ్లి డబ్బులు తేవాలని అరుణను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అరుణ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది. అయితే తాను చనిపోతే పిల్లలను ఎవరూ చూసుకుంటారనే అనుకుందో ఏమో కానీ పిల్లలతో కలిసి రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.

దాణాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తున్న క్రమంలో ముందుగా పిల్లలను తోసింది. అనంతరం తానూ రైలు కింద పడింది. అయితే మహిళ చర్యను కొద్ది దూరంలో ఉండగా గమనించిన లోకో పైలట్ హారన్ మోగించి బ్రేక్ వేశాడు. అయినా లాభం లేకుండా పోయింది. వారిపై నుంచి రైలు కొద్ది దూరం దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు వారిని రైలు కింద నుంచి తీశారు. అరుణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రగాయాలైన సాత్విక్‌, సాత్వికలను రైల్వే అధికారులు వెంటనే గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సాత్విక చికిత్స పొందుతూ మృతి చెందింది. సాత్విక్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో అతడిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రామగుండం జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.