ప్రేమ వ్యవహారం ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నది. ఒకే కుటుంబంలో ఐదుగురిని హత్య చేసి వ్యవసాయ పొలాల్లో పూడ్చి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ దివాస్ జిల్లాలోని నీమావార్ పట్టణంలో మే 13వ తేదీన ఐదుగురు అదృశ్యమయ్యారు. దీంతో వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా: తామే ఆ కుటుంబాన్ని హత్య చేసినట్లు చెప్పారు. వ్యవసాయ పొలాల్లో 10 ఫీట్ల లోతులో పూడ్చిపెట్టామని పేర్కొన్నారు. దీంతో పోలీసులు జేసీబీల సాయంతో ఆ ప్రాంతాన్ని తవ్వి.. ఐదు అస్థిపంజరాలను మంగళవారం వెలికితీశారు.

మృతులను మమతా బాయి కాస్తే (45), ఆమె కుమార్తెలు రూపాలి(21), దివ్య(14), బంధువులు పూజ ఓస్వాల్(15), పవన్ ఓస్వాల్(14) గా పోలీసులు గుర్తించారు. అయితే నిందితుల్లో ఒకరు.. మమతా కుమార్తెలతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ఆ కుటుంబం హత్యకు గురైందని, ఆ వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.