ఒక్క రోజే ఆరోగ్యశాఖకు 24 ఫిర్యాదులు పర్మిషన్‌లు రద్దు చేస్తున్నా పట్టించుకోని యాజమాన్యాలు, తమపై వేటు వేయొద్దంటూ కొన్ని హాస్పిటల్స్ లాబీయింగ్‌లు, కరోనా చికిత్స ధరలు ప్రదర్శించేలా ఆరోగ్యశాఖ ఆదేశం హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడి ఆగడం లేదు. బుధవారం ఒక్క రోజే ఆరోగ్యశాఖకు 24 ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వం పర్మిషన్లను రద్దు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. అంతేగాక తమపై వేటు వేయొద్దంటూ ఏకంగా కొన్ని హాస్పిటల్స్ లాబియింగ్‌లు కూడా చేస్తున్నాయని ఓ ముఖ్య అధికారి తెలిపారు.

ఆసలు ఏం జరుగుతోంది?

రాష్ట్రంలో కరోనా వైద్యం ప్రజలకు పెనుభారం పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కోవిడ్ చికిత్సకు ప్రత్యేక ధర లు నిర్ణయించింది. వాటిని జి.ఓ 248 రూపంలో జూన్ 15వ తేదిన విడుదల చేశారు. అదే విధంగా 248కి అనుసంధానంగా జూలై 7వ తేదిన మరిన్ని షరతులతో మరో జి.ఓ281ను ప్రకటించారు. వీటి ప్రకారమే కరోనా చికిత్సకు ధరలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం చెయొద్దని ఏకంగా గవర్నర్ ,సిఎంతో పాటు మంత్రి అధికారులు సూచించినా మార్పు రాలేదు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్‌పై ఫిర్యాదుల కొరకు జూలై 15వ తేదిన వైద్యశాఖ 9154170960 వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది.

బాధితులు నేరుగా ఫిర్యాదులు చేయొచ్చని సూచించింది. వీటిలో ఇప్పటికే సోమాజిగూడ డెక్కన్, బంజారాహిల్స్ విరించి హాస్పిటల్స్‌ను రద్దు చేయగా, మిగతా ఆసుపత్రులపై విచారణ జరుగుతోంది. ఈక్రమంలో కొన్ని ఆసుపత్రులు తమపై వేటు వేయొద్దని తమదైన శైలిలో లాబియింగ్‌లకు పాల్పడటం గమనార్హం. కరోనా చికిత్సను అందించే ప్రైవేట్ హాస్పిటల్స్ సాధారణ వార్డుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూలో ఉంచితే 7, వెంటిలేటర్‌తో పాటు ఐసియూలో చికిత్సను అందిస్తే 9వేలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇవే ధరలను ప్రతి ఆసుపత్రి ముందు అందరికి కనిపించేలా ప్రదర్శించాలని ఆరోగ్యశాఖ ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తెలిపింది. హాస్పిటల్స్‌లో ఉన్న బెడ్ల వివరాలతో పాటు చికిత్స ధరలను కూడా ప్రవేశమార్గం ముందు ప్రదర్శించాలని పెట్టాలని వైద్యశాఖ ఆదేశించింది.