కొవిడ్‌-19 మరణాల రేటును తగ్గించడంలో ప్లాస్మా థెరపీ పెద్దగా ఉపయోగపడడం లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) అధ్యయనంలో తేలింది. కొవిడ్‌-19 తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడంలోనూ ఈ చికిత్సా విధానం ప్రయోజనం చూపడం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 29 కొవిడ్‌ చికిత్సా కేంద్రాల్లో 464 మందిపై అధ్యయనం జరిపిన అనంతరం ఈ విషయాలు వెల్లడించింది. ఏప్రిల్‌ 22 నుంచి జులై 14 మధ్య ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపింది. కొవిడ్‌ కట్టడి చర్యల్ని పర్యవేక్షించేందుకు ఐసీఎంఆర్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యదళం ఈ అధ్యయనాన్ని ధ్రువపరిచింది. ఈ చికిత్సా విధానంలో అనేక మినహాయింపులు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. పరిమిత వసతులుండే సాధారణ ప్రయోగశాలల్లో ఈ థెరపీని చేపట్టడం సాధ్యం కాదని తెలిపింది.

చికిత్సకు ముందు దాత, రోగిలో యాంటీబాడీల సంఖ్యను లెక్కించడం వల్ల ఈ థెరపీ ప్రయోజనంపై స్పష్టత లభించే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనంలో మొత్తం 464 మంది మోతాదు స్థాయిలో కొవిడ్‌ లక్షణాలున్నవారు పాల్గొన్నారు. వీరిలో 235 మందికి ప్రామాణిక చికిత్సా విధానం(బీఎస్సీ)తో పాటు ప్లాస్మా థెరపీ అందించారు. మరో 229 మందికి కేవలం బీఎస్సీని కొనసాగించారు. 28 రోజుల పర్యవేక్షణలో రెండు వర్గాల మరణాల రేటులోగానీ, తక్కువ లక్షణాలున్నవారు విషమ పరిస్థితుల్లోకి వెళ్లడంలోగానీ పెద్దగా తేడా కనిపించలేదని అధ్యయనంలో తేలింది. దీని ఆధారంగా ప్లాస్మా చికిత్స వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.
అయితే, ఈ చికిత్స విధానానికి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం లభించింది. కొవిడ్‌ కట్టడి కోసం జూన్‌ 27న కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో.. మోతాదు స్థాయి లక్షణాలున్న వారికి ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ అందజేయొచ్చని తెలిపింది.