ఓ సాధారణ పౌరుడు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు స్థానిక సమస్యలను ట్విట్టర్‌ ద్వారా విన్నవించి మరిచిపోయాడు. మంత్రి కేటీఆర్‌ మాత్రం ఆ పోస్టును చదివి అందులో ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించడంతో ఆశ్చర్యపోవడం అతని వంతైంది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన శ్రీరాం ఓం ప్రకాశ్‌, తమ కాలనీకి మిషన్‌ భగీరథ నీరు రావడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని మే 21న ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు పోస్టు చేశా డు. మంత్రి ఆదేశం మేరకు గురువారం అధికారులు ప్రకాశ్‌ ఇంటికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. తన పోస్టుకు మంత్రి కేటీఆర్‌ స్పందించి అధికారులను పంపడమే గాక పనులు చేపట్టడంపై సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.