గౌరీబిదనూర్ తాలూకాలోని కంబలహళ్లి అనే గ్రామంలో శంకర్ అనే 30 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతనిని హత్య చేసింది మరెవరో కాదు అతని స్నేహితుడు అశోక్. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. అశోక్ లారీ డ్రైవర్ కాగా శంకర్ క్లీనర్‌గా వెళ్లేవాడు అశోక్‌కు పెళ్లయింది. అతని భార్య పేరు పద్మ. అశోక్, శంకర్ స్నేహితులు కావడంతో అప్పుడప్పుడూ అశోక్ కోసం కొన్ని సందర్భాల్లో అశోక్‌తో కలిసి అతని ఇంటికి శంకర్ వెళ్లేవాడు. ఆ సందర్భంలోనే అశోక్ భార్యతో శంకర్‌కు పరిచయం ఏర్పడింది. స్నేహితుడి భార్యపై శంకర్‌కు కన్ను పడింది. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పద్మ కూడా ఆమె భర్త అశోక్‌కు నమ్మక ద్రోహం చేసి అతని స్నేహితుడైన శంకర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణలు నడిచాయి. అయితే ఈ విషయం అశోక్‌కు చాలా ఆలస్యంగా తెలిసింది. ఇటీవల తన స్నేహితుడు శంకర్ ఫోన్‌లో పద్మతో వాట్సాప్ సంభాషణలు చూసి అశోక్ షాకయ్యాడు. పక్కనే తిరుగుతూ తనకు ఇంత నమ్మకద్రోహం చేశాడని శంకర్‌పై అశోక్ పగ పెంచుకున్నాడు. అతనిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పని మీద అశోక్‌తో కలిసి శంకర్ బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతనిని చంపేయాలని ముందే ప్లాన్ చేసుకున్న అశోక్ ఇనుప రాడ్‌తో దాడి చేసి అతనిని అంతమొందించాడు.

అశోక్‌తో పాటు ఈ హత్యకు చంద్రు, అతని కొందరు స్నేహితులు సహకరించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అశోక్ భార్యను కూడా ఈ కేసులో విచారిస్తున్నారు. శంకర్‌ను హత్య చేసిన అశోక్ అతని శవాన్ని మాయం చేసేందుకు తగలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. పెట్రోల్ పోసి శంకర్ మృతదేహాన్ని తగలబెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే సగం కాలిన మృతదేహాన్ని గ్రామస్తుల్లో ఒకరు చూసి భయంతో ఊళ్లో వాళ్లకు సమాచారమిచ్చారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. ఆ మృతదేహం శంకర్‌దేనని కుటుంబ సభ్యులు చెప్పిన కొన్ని గుర్తుల ద్వారా గుర్తించారు. శంకర్‌ను హత్య చేసి పరారైన అశోక్ భయంతో తనంతట తానే మరుసటి రోజు పోలీసులకు లొంగిపోయాడు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించినందు వల్లే ఈ హత్య చేసినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడితో పాటు ఈ హత్యలో భాగమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.