బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన ఆక్సిడెంట్ కు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిని అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. డిసెంబరు 12 వరకు అతడ్ని అరెస్టు చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది.

అతి వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడంటూ కల్వకుంట్ల కృష్ణమిలాన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ డ్రైవింగ్‌తో ఒకరి మృతికి కారణమయ్యాడని అతనిపై అభియోగం మోపారు. ఫ్లైఓవర్‌పై 40కి.మీ స్పీడ్‌తో వెళ్లాలన్న నిబంధనను లెక్క చేయకుండా 105కి.మీ వేగంతో కారు నడిపినందుకు రూ.1000 జరిమానా విధించారు. దీనికి సంబంధించి కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది ‘ఎస్’ ఆకారంలో మలుపు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తన క్లయింట్ 40-50 కిలోమీటర్ల వేగంతోనే కారు నడిపాడని తెలిపారు. ఫ్లై ఓవర్ డిజైన్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని, ఇంతకుముందు కూడా ఇద్దరు మృతిచెందారని.. దానికి కారణం డిజైన్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. దీంతో.. కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. డిజైన్ లోపం అంటూ నిందితుడు చేస్తున్న ఆరోపణలపై స్పందించాలని తెలిపింది. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన కారు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికి అక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.