తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే సెప్టెంబర్‌ 2న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో వర్షపునీరు శివాలయం గర్భగుడిలోకి చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

మరోవైపు భాగ్యనగరం కూడా వర్షంతో తడిసి ముద్దవుతోంది. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోకి మోకల్లోతు నీరు చేరింది. దీంతో పాదాచరులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి పలు ప్రాంతాల్లో భారీ నుండి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమైనవి. రాజ్ భవన్, అసెంబ్లీ, నల్లకుంట, ఖైరతాబాద్, పంజాగుట్ట, పెద్దమ్మ గుడి తదితర ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు చేరడంతో ఆయా ప్రాంతాలకు జిహెచ్ఎంసి మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు చేరుకొని వరద నీటిని తొలగించాయి.