మహిళ తలపైనుంచి బస్సు వెళ్లడంతో ఆమె తల ఛిద్రమైంది

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో మంగళవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హోండా యాక్టీవాపై వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తలపైనుంచి బస్సు వెళ్లడంతో ఆమె తల ఛిద్రమైంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళను టీసీఎస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సోహిని సక్సేనాగా గుర్తించారు. బస్సు చక్రాల కింద నలిగిపోయి ఆమె నడిపిస్తున్న యాక్టివా వాహనం నుజ్జునుజ్జయింది. బస్సును తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడిపినట్టు తెలుస్తోంది.

ఘటన అనంతరం తాత్కాలిక డ్రైవర్‌ను పట్టుకొని స్థానికులు చితకబాదారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోని ఇదే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడేళ్లలో ఇక్కడి బ్లాక్‌స్పాట్‌లో రోడ్డు ప్రమాదాలు జరిగి ఐదుగురు ప్రాణాలు విడిచారు. తాజా రోడ్డు ప్రమాదంతో ఇక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.