సిద్దిపేట: బతుకమ్మ పండగ వేళ మండలంలోని వీరాపూర్‌లో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా మామిడి స్వప్న(45)ను ఆమె భర్త ఎల్లారెడ్డి రాడ్డుతో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి వీరాపూర్‌ గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు మంగ, స్వప్న ఉన్నారు. అదే గ్రామంలోని యాల్ల ఎల్లారెడ్డితో పెద్ద కూతురు మంగ వివాహం 20ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లి జరిగిన నెలకే మంగ ఆత్మహత్య చేసుకుంది. తరువాత రెండో కూతురు స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆరేళ్ల వరకు వారు అనోన్యంగానే ఉన్నారు.

వారికి కుమార్తె సుశ్మిత, కుమారుడు శ్రీజన్‌ ఉన్నారు. భార్యాభర్త తరుచు గొడవ పడేవారు. కాగా 14ఏళ్ల నుంచి అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స‍్వప్న సహజవనం చేస్తోంది. తనను వదిలి మరో వ్యక్తితో ఉంటోందని మనుసులో పెట్టుకున్న ఎల్లారెడ్డి బతుకమ్మ ఆడుతున్న స్వప్నను రాడ్‌తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కూతురును హత్య చేసిన ఎల్లారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తల్లి ఎల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ ఆవుల తిరుపతి తెలిపారు.