మంత్రి కేటీఆర్‌ ఇలాకా సిరిసిల్లలోని ధర్మాస్పత్రులు ప్రసూతి సేవకు నిరాకరించడంతో ఓ గిరిజన మహిళ నరకయాతన అనుభవించింది. ‘ఇక్కడ కాదు, అక్కడికి వెళ్లండి’ అంటూ రెండు ప్రభుత్వ ఆస్పత్రులు తిప్పి పంపాయి. పురుటి నొప్పులతో బాధపడుతూ వెళ్లిన గర్భిణిని వైద్య సిబ్బంది పట్టించు కోకపోవడంతో రోడ్డుపైనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రికి వెళ్లినప్పటికీ వైద్యసిబ్బంది పట్టించుకోలేదు. ఈ ఘటన వేములవాడ తిప్పాపూర్‌ బస్టాండ్‌లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది…

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామ శివారులోని గైరిగుట్ట తండాకు చెందిన మౌనిక అనే గిరిజన మహిళకు బుధవారం పురుటి నొప్పులు రావడంతో చందుర్తి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుంది. అక్కడ వైద్యసిబ్బంది లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి వచ్చింది. మౌనిక ప్రసవానికి సంబంధించిన డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకపోవడంతో కరీంనగర్‌ ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సిరిసిల్ల ఏరియా వైద్య సిబ్బందిగా నిర్లక్ష్యంగా సూచించారు. దీంతో గిరిజన మహిళ తిరిగి కోరుట్లకు వెళ్లేందుకు వేములవాడకు వచ్చింది.

తిప్పాపూర్‌ బస్టాండ్‌లో రోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్థానికులు చికిత్స నిమిత్తం వేములవాడలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై చందుర్తి డాక్టర్‌ మసూద్‌ను వివరణ కోరగా, నాలుగో డెలివరీ కావడం హైరిస్క్‌ కేసు కావడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని వారం రోజుల ముందే సదరు గర్భిణికి సూచించామని తెలిపారు…