బస్సుడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. వేగంగా వస్తూ డ్రైవర్ బస్సును ఎడమవైపు తిప్పడంతో బస్సువెనుకాల ద్విచక్రవాహనంపై వస్తున్న భార్య భర్తలను డ్రైవర్ గమనించక పోవడంతో భార్యభర్తలిద్దరు కిందపడి పోగా భార్యతొడ, ఛాతిపై నుండి బస్సు వెనుకచక్రాలు ఎక్కిన సంఘటన బుధవారం హిమాయత్‌నగర్ వైజంక్షన్‌లో చోటు చేసుకుంది. ముషీరాబాద్ కుమ్మరిబస్తీకి చెందిన సతీష్‌గౌడ్, భార్యషాలినీ (రెండు మాసాల గర్భిని)లు బుధవారం ఉదయం హైదర్‌గూడా పెర్నాండేజ్ ఆసుపత్రికి పరీక్షల కోసం వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ముషీరాబాద్ డిపోకు చెందిన ఏపి28జెడ్0017 నెంబర్ గల బస్సు కోఠి నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తుంది.

హిమాయత్‌నగర్ వైజంక్షన్ వద్ద వేగంగా వస్తూ కుడివైపు బైక్‌పై వెళ్తున్న వంపతులను డీకొట్టింది. దీంతో వారు అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో షాలీని తీవ్రంగా గాయపడింది. అక్కడనే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేష్ అంబులెన్స్ సాయంలో హైదర్‌గూడా అపోలో ఆసుపత్రికి తరలించారు. నిర్లక్షంగా బస్సు నడిపిన మహాబూబ్‌నగర్ జిల్లా ఫరీద్‌పూర్ గ్రామానికి చెందిన కమలన్న డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై చందర్‌సింగ్ తెలిపారు.