కరోనావైరస్ తో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి మృతదేహం బస్ స్టాండులో దొరికిన ఘటన గుజరాత్ లో జరిగింది. చాగన్ మక్వానా అనే 67 ఏళ్ల వ్యక్తి శ్వాస ఇబ్బందితో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతనికి పరీక్ష చేసి కరోనా సోకినట్లు తేల్చారు. దాంతో మక్వానా మే 10 నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, మే 16 శనివారం రాత్రి మక్వానా మృతదేహం అహ్మదాబాద్‌లోని డానిలిమ్డాలోని బీఆర్‌టిఎస్ బస్ స్టాండ్‌లో లభించింది. పోలీసులు వెంటనే మృతదేహాన్ని వీఎస్ ఆస్పత్రికి తరలించారు.అయితే మక్వానా జేబులో పోలీసులు ఒక లేఖను మరియు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని ద్వారా మక్వానా అహ్మదాబాద్‌లోని డానిలిమ్డా ప్రాంతంలోని రోహిత్ పార్క్ సొసైటీ నివాసి అని తెలిసింది.

మక్వానా కుటుంబసభ్యుల ప్రకారం: మక్వానా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో కరోనావైరస్ పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో మక్వానాకు కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో ఆయనను సివిల్ ఆస్పత్రికి పంపించారు. అప్పటినుంచి మక్వానా సివిల్ ఆస్పత్రిలోనే చికిత్స్ పొందుతున్నాడు. మక్వానా మరణ వార్త తెలిసి మేమంతా షాక్ కు గురయ్యాం. మక్వానా ఇన్ఫెక్షన్ నుండి కోలుకోగానే తెలియజేస్తామని సివిల్ ఆస్పత్రి అధికారులు అన్నారని ఆయన కుటుంబసభ్యులు పోలీసు అధికారులకు తెలిపారు.

మక్వానాకు కరోనా సోకినట్లు నిర్ధారణ కాగానే ఆస్పత్రి సిబ్బంది మాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఆ తర్వాత డానిలిమ్డా కార్పొరేషన్ అధికారులు మా ఇంటికి హోంక్వారంటైన్ బోర్డును తగిలించారు. అంతేకాకుండా మా ఇంట్లో వాళ్లందరినీ 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండమని చెప్పారని మక్వానా కుటుంబసభ్యలు తెలిపారు. ఇన్ని చేసిన అధికారులు, కరోనా సోకిన మక్వానాను ఆస్పత్రి నుంచి బయటకు ఎలా పంపించారని ఆయన కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన గురించి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దర్యాప్తు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేపీ గుప్తాను ఆదేశించారు.