వివాదాదస్పద ట్వీట్లతో ఇటీవల తరచుగా విమర్శలను ఎదుర్కొంటున్న సినీనటుడు, జనసేన నేత నాగబాబు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎవరూ ఊహించని విధంగా ఈసారి నందమూరి బాలకృష్ణపై విరుచుకుపడ్డారు. బాలయ్య నోటిని అదుపులో పెట్టుకోవాలి అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు‌. టాలీవుడ్‌ ప్రముఖుల వరుస భేటీలపై తనకు సమాచారం లేదంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.

‘భూములు పంచుకుంటున్నారంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఇండస్ట్రీ బాగు కోసమే మంత్రితో సమావేశం అయ్యారు. భూములు పంచుకోవడానికి కాదు. సీనియర్‌ నటుడైన బాలకృష్ణ ఇలా అర్థంలేని విధంగా మాట్లాడం సరికాదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయనేది ఏపీకి వెళ్తే తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీనే కాదు.. తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా బాలయ్య అవమానించారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి ’అని ఘాటు వ్యాఖ్యలతో విరుకుపడ్డారు