• అక్రమంగా కూల్చివేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశం
  • ఫలించిన ఇద్దరు యువకుల న్యాయ పోరాటం.

బాలసముద్రం రోడ్డులోని పెట్రోల్ పంపు ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు మే నెలలో అక్రమంగా ధ్వంసం చేసిన డివైడర్ ను మళ్లీ నిర్మించి ఆ వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నగర పాలక సంస్థ కమీషనర్ పై జిల్లా శాశ్వత లోక్ అదాలత్ లో తోట పవన్ యూత్ కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ అధ్యక్షులు మరియు ఎన్నంశెట్టి అఖిల్ అనే యువ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై పలు నెలలుగా విచారణ జరపగా బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు శాశ్వత లోక్ అదాలత్ ఛైర్పర్సన్ ఈడ తిరుమలా దేవి తీర్పు వెలువరించారు.

కోట్ల రూపాయల ప్రజా ధనం తో నిర్మించిన ఈ రోడ్డు పై డివైడర్ ను ప్రైవేటు వ్యక్తులు వారి వ్యాపార స్వార్థం కోసం అక్రమంగా కూల్చివేసారని, దీని పై చేసిన ఫిర్యాదులను నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోగా ప్రైవేట్ వ్యక్తులకు వంతు పాడుతున్నారని, కావున ఆ డివైడర్ ను వెంటనే నిర్మించి, ప్రభుత్వ ఆస్తిని ద్వంసం చేసిన వ్యక్తుల పై క్రిమినల్ చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. అయితే ఈ కూల్చివేత ప్రజలకు అనుకూలంగా ఉంది అని, ఈ కూల్చివేతను అలాగే ఉండనివ్వాలని తమకు అనేక వ్యక్తులు, కాలనీల సంఘాలు అర్జీలు ఇచ్చారని నగర పాలక సంస్థ వాదించింది. అయితే అసలు అక్రమ నిర్మాణాలను, ప్రజా ఆస్తి ధ్వంసం చేయడాన్ని ప్రభుత్వాలు ఉపెక్షించరాడని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. పైగా ఆ అర్జీలు అన్నీ పాత తేదీలతో ఇప్పటికిప్పుడు నగర పాలక సంస్థ అధికారులు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, అందువల్ల అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని వాదించిన పిటిషనర్లు దానిని నిరూపించడానికి అదే నగర పాలక సంస్థ ఇన్వర్డ్ రిజిస్టర్ ప్రతులను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి కోర్టు అందజేశారు.

అసలు ఈ డివైడర్ కూల్చివేత ద్వారా అక్కడున్న పెట్రోల్ పంపు వ్యాపారానికి తప్ప అసలు ఏ కాలనీ వాసులకు కానీ వాహనదారులకు కానీ ఉపయోగం లేదని, పైగా అనేక ప్రమాదాలకు కారణంమౌతోందని కోర్టుకు తెలియజేశారు. అయితే దీని పై సుధీర్ఘ వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి బుధవారం తుది తీర్పు వెలువరించారు. నగర పాలక సంస్థ అధికారులు విభాగినిని తిరిగి నిర్మించాలని, దానిని తొలగించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పిటిషనర్లు పేర్కొన్నట్టు వారికి కలిగిన అసౌకర్యానికి గాను చెరో రూపాయి అధికారులు చెల్లించాలని తీర్పులో తెలిపారు….