ముంబై: బుల్లితెర నటుడు, మోడల్ సమీర్ శర్మ( 44) ముంబైలోని మలద్ పశ్చిమలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్ మెంట్ లో తన ఇంట్లో సమీర్ కిచెన్ సీలింగ్ కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమీర్ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు మలాడ్ పోలీసులు తెలిపారు. సమీర్ మృతదేహాన్ని గమనించిన నైట్ వాచ్ మెన్ సొసైటీ సభ్యులను అప్రమత్తం చేశాడు. మృతదేహాం పరిస్థితిని చూస్తే, రెండు రోజుల క్రితం నటుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో సూసైడ్ నోట్ లాంటిది ఏమీ కనబడలేదని పోలీసులు చెబుతన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం మార్చురీకి పంపినట్టు సీనియర్ ఇన్స్పెక్టర్ జార్జ్ ఫెర్నాండెజ్ తెలిపారు. సమీర్ కహానీ ఘర్ ఘర్ కి, ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూన్, క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ వంటి టివి సీరియళ్లలో నటించారు. యే రిష్తే హై ప్యార్ కేలో తండ్రి పాత్రలో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.