ముంబయిలో మృతి చెందిన ఓ యాచకుడి ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులు అక్కడ డబ్బుల మూటలు చూసి షాకయ్యారు. అతడి ఇంట్లో దొరికిన చిల్లర నాణేలు లెక్కించడానికే వారికి దాదాపు 8 గంటలు పట్టింది. అతడి బ్యాంకు బ్యాలెన్సులు కూడా భారీగా ఉండటంతో పోలీసులు వాటిని అతడి కుటుంబానికి చేర్చే పనిలో పడ్డారు.

ముంబయిలో గొవండి ప్రాంతంలో నివసించే బిర్బిచాంద్‌ అజాద్(62), అనే ఓ యాచకుడు శుక్రవారం ముంబైలోని గొవండి స్టేషన్‌ వద్ద రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. ప్రభుత్వ రైల్వే పోలీసులు అక్కడే పనిచేసే తోపుడుబండ్ల వారి సాయంతో అతడి వివరాలు సేకరించి అతడి ఇంటిని పరిశీలించారు. అజాద్‌ ఇంటికి వెళ్లిన జీఆర్‌పీ అధికారులు అతడి సంపాదన చూసి ఆశ్చర్యపోయారు. మూటలు కట్టిన సంచుల్లో దాదాపు రూ.1.50లక్షలకు పైగా చిల్లర బయటపడింది.

అది లెక్కబెట్టేందుకు వారికి దాదాపు 8గంటల సమయం పట్టిందట. అతడి పలు బ్యాంకుల్లో అతడి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.8.77లక్షలు ఉండటంతో ఆశ్చర్యపోయారు. అక్కడే అతడి పాన్‌, ఆధార్‌, సీనియర్‌ సిటిజన్‌ కార్డుల ఆధారంగా అజాద్‌ది రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీంతో అతడి కుటుంబాన్ని గుర్తించేందుకు రాజస్థాన్‌కు వెళ్లనున్నట్లు వారు తెలిపారు.

అతడి నగదు మొత్తాన్ని వారి కుటుంబసభ్యులకు అందజేస్తామని చెప్పారు. కొన్నేళ్ల కిందట అజాద్‌ ముంబయికి వలస వచ్చి ఇక్కడే యాచకుడిగా జీవనం సాగిస్తున్నట్లు ఇరుగుపొరుగు వారు వెల్లడించారు.