బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్ బుధవారం నాడు హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది అరుణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ: అమ్మాయి పోలీసుల తొందరపాటు వల్ల బిఫార్మసి విద్యార్థిని జీవించే హక్కు కోల్పోయిందని, కిడ్నాప్ కేసులో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తప్పుబట్టారు. కిడ్నాప్ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మీడియా సమావేశాలు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కృంగిపోయిందన్నారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని, విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని హెచ్‌ఆర్సీని అరుణ్‌మార్ కోరారు.

ముఖ్యంగా రాచకొండ పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని ఆశ్రయించామని, పోలీసుల తొందరపాటు చర్యల వల్ల విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందన్నారు. తొలుత కొందరిని ముద్దాయిలు అని చెప్పిన పోలీసులు తిరిగి వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు కేసు విషయాలని చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయని, వాటిని చూసి భరించలేక షుగర్ టాబ్లెట్లు వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు ఇప్పుడు ఎవరు బాధ్యులని, ఇలా వ్యవహరించిన పోలీసులు చర్యలు తీసుకోవాలని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

అనుమానస్పద మృతిగా కేసు నమోదు:

విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైనప్పటికీ ఆత్మహత్యపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కిడ్నాప్ డ్రామా ఈ కేసులో పోలీస్ శాఖను తప్పుదోవ పట్టించినందుకు బిఫార్మసి విద్యార్థినికి శిక్ష పడే అవకాశముందన్న భావనతో సదరు విద్యార్థిని తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా విద్యార్థిని ఆత్మహత్యపై ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ తర్వాతనే తేలనుంది. ఇదిలావుండగా విద్యార్థిని చనిపోవడానికి కారణాలపై ఆమె తల్లిదండ్రులు స్పష్టతకు రాలేకపోతున్నారు. ఆరోగ్యం బాగో లేదని మంగళవారం గాంధీ హాస్పిటల్‌కు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. విద్యార్థిని వారం రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఆహారం తీసుకోవడం లేదని మృతురాలి కుటింబీకులు వివరించారు. అయితే పోస్టుమార్టం ప్రాధమిక నివేదకలోను మృతిపై స్పష్టత రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు.