భారత్‌ రక్షణ దళాల్లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో కేసుల సంఖ్య ఆరు లక్షల మార్కుకు చేరువకానుంది. కాగా, దేశ రక్షణలో పాలుపంచుకునే జవాన్ల మీద ఈ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 2000ల మందికి పైగా బీఎస్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఈ వైరస్‌ బారిన పడినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 1,219 మంది, బీఎస్‌ఎఫ్‌కు చెందిన 1,018 మందికి ఈ వైరస్‌ సోకినట్లు తెలిపింది.
బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 5,85,493 మందికి కరోనా వైరస్‌ సోకగా, 17,400 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క జూన్‌ నెలలోనే 4లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ బారిన పడి, కోలుకుంటున్న వారు 60 శాతంగా ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది.