కరడుగట్టిన నేరస్తుడైన ఆ రౌడీషీటర్‌ బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అందుకు తేదీ ఖరారు చేసుకొని సభను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అతిథులందరూ హాజరయ్యారు. పార్టీలో చేరేందుకు అతడి అనుచరులు కూడా వచ్చారు. అయితే సభ వద్ద పోలీసులు ప్రత్యక్షమవడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన తమిళనాడులో వందలూరు సమీపంలోని వత్తేతిలో చోటుచేసుకుంది. రౌడీషీటర్‌ రెడ్ హిల్స్ సూర్యపై పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అతడు భాజపాలో చేరాలని నిశ్చయించుకున్నాడు. తమిళనాడు పార్టీ అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని అనుచరులతో సహా సభ వద్దకు వచ్చాడు. సమాచారం అందుకున్న చెంగల్పట్టు పోలీసులు ఆ సభను చుట్టుముట్టారు.

విషయాన్ని పసిగట్టిన రౌడీషీటర్‌ చాకచక్యంగా అక్కడి నుంచి కారులో ఉడాయించాడు. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు అనుచరులను అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌ మీద విడుదలయ్యారు, కాగా ఈ విషయంపై పార్టీ అధ్యక్షుడు మురుగన్‌ పోలీసులను ఆరా తీయడంతో వారు పలు విషయాలు వెల్లడించారు. సూర్యపై 35కు పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, అందులో 6 హత్య కేసులు అని పేర్కొన్నారు. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపారు. అయితే పార్టీలో చేరేవారి వివరాలు తనకు తెలియవని మురుగన్‌ ఈసందర్భంగా పేర్కొన్నారు…