చిన్న పిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటలకు టీచర్లు ఫిదా అయిపోతుంటారు. అమాయకంగా ఉండే వారి ముఖం చూసి తప్పుచేసినా కోప్పడకుండా ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు. తాజాగా, తాజాగా ఓ బుడ్డోడు కూడా తాను చేసిన తప్పును క్షమించమంటూ టీచర్‌కి ముద్దులిస్తూ మళ్లీ ఇలా చేయనంటూ ప్రామిస్ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటికే పద్నాలుగు లక్షలకుపైగా వ్యూస్, వేలాది లైకులు వచ్చాయి. నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. బిహార్‌ చాప్రా జిల్లాలోని ఓ స్కూల్‌లో జరిగిన ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. తాను మళ్లీ అలా చేయనంటూ టీచర్ దగ్గరకు వచ్చి ఆ చిన్నారి దీనంగా ఆమెను బతిమిలాడుతుండటం, టీచర్ బుంగమూతి పెట్టడం, కొద్ది సేపటి తర్వాత టీచర్‌ను హత్తుకుని ముద్దులు కురిపించాడు. మళ్లీ ఎప్పుడూ అలా చేయనని టీచర్‌కు ఆ చిన్నారి చెబుతుంటే ఆమె పక్కాగా అంటే అవును మేడం పక్కా, మళ్లీ ఈసారి అలా చేయను అని బుడతడు బుదులివ్వడం వీడియోలో కనిపిస్తోంది.

అదే సమయంలో చిరు కోపాన్ని నటిస్తూ నువ్వు మళ్లీ అలాగే చేస్తావని మేడమ్ అంటే అలా చేయనంటూ ఆమె చుట్టూ రెండు చేతులువేసి చెంపలపై ముద్దులు పెట్టాడు. టీచర్, విద్యార్థి మధ్య ఈ సంభాషణ చూడటానికి చాలా మనోహరంగా ఉంది. వీడియో చివరలో పిల్లవాడు తన టీచర్‌కి భవిష్యత్తులో తప్పులు చేయనని హామీ ఇచ్చాడు. దీని తరువాత ఆమె కూడా క్షమించి అతడి బుగ్గలపై ముద్దు పెట్టుకున్నారు. దాదాపు 1 నిమిషం 26 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది. పిల్లాడ్ని తన బిడ్డలా ఆ టీచర్ ప్రేమగా దండించడం నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పుచేస్తే కొట్టే టీచర్లను చూశాం కానీ, ఇలా వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని లాలించడం చాలా గొప్ప విషయమని అంటున్నారు. కొందరైతే మేము చదువుకున్నప్పుడు ఇలాంటి టీచర్లు లేరే అని తెగ బాధపడిపోతున్నారు.