ముద్దు ముద్దుగా కనిపించే చిన్న పిల్లలను చూసి పెద్ద వారు బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పిల్లలపై తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దుపెట్టుకున్నాడు. వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీకి ఓ కార్యక్రమంలో ఈ ఘటన ఎదురైంది. షేక్ హ్యాండ్ ఇస్తే ఏముంటుంది అనుకున్నాడో ఏమో ఇలా తన ఆప్యాయతను వ్యక్తం చేశాడు.

ఆ చిన్నోడి సరదా చూసిన వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఆమెకు స్కూలు విద్యార్థులు, పార్టీ శ్రేణులు అంతా స్వాగతం పలికారు.

అక్కడికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు అడుగులు వేస్తున్నారు. స్కూలు విద్యార్థులు కూడా ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ సంబరపడిపోయారు. ఓ విద్యార్థి మాత్రం అందరిలా కాకుండా ఆమె బుగ్గ గిల్లి చేతో ముద్దు పెట్టుకున్నాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాతో ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేపై ఆ బుడ్డో ప్రేమ చూసి నెటిజన్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు.