భువనగిరి అర్బన్: నూతనంగా చేప డుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం ఆమె భువనగిరి మండలంలోని తుక్కాపూర్ గ్రామ పరిధిలో పది ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి ఇప్పటి వరకు చేపట్టిన పనులను పరిశీలించారు. మొక్కలు నాటి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ: ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆరు వేల గుంతలు తీసి మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం ప్రారంభం నుంచి కంపచెట్ల తొలగింపు, భూమిని చదును చేయడం, గుంతలు తీయడం తదితర పనులను కలెక్టర్ ఫొటోల ద్వారా పరిశీలించి సంతృప్తివ్యక్తం చేశారు.

150 మంది కూలీలతో ఉపాధిహామీలో భాగంగా బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ అదే గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి గ్రామ పంచాయతీకి చేరుకుని ఉపాధిహామీ పథకానికి సంబంధించి రికార్డులను పరిశీలించారు. మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయబడిన గ్రామ అభివృద్ధి పనులు, పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆసరా పింఛన్ల పంపిణీపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.