పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి ఇష్టానుసారం చితకబాదారు

తండ్రి, కుమారుడిని చితకబాదిన బెంగళూరు పోలీసులకు మానవహక్కుల కమిషన్‌ రూ.50 వేల జరిమానా విధించింది. వివరాలు.. ఇటీవల బాణసవాడిలో గ్యాస్‌ స్టౌ మరమ్మత్తులు చేస్తూ జీవనం సాగిస్తున్న తండ్రీ, కుమారున్ని బాణసవాడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. తనిఖీలు చేస్తున్న సమయంలో వారి వద్దనున్న ద్విచక్ర వాహనాల రికార్డులు అందించాలని ఎస్‌ఐ మురళి, హెడ్‌కానిస్టేబుల్‌ లోకేశ్‌ అడిగారు. ఒక వాహనం పత్రాలు అందించి, మరో వాహనం పత్రాలు అందించడానికి నిరాకరించారు.

దీంతో పోలీసులు తండ్రీ, కుమారుడిని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి ఇష్టానుసారం చితకబాదారు. దీంతో బాధితులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు మానవహక్కుల కమిషన్‌ ముందు వివరణ ఇస్తూ తండ్రీ, కుమారుడు తమ విధులకు అడ్డుపడటంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. కానీ పోలీసుల వాదనను తోసిపుచ్చిన మానవహక్కుల కమిషన్‌ చట్టప్రకారం చర్యలు తీసుకోవడం వదిలిపెట్టి ఇలా ఇష్టానుసారం కొడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది. శిక్షగా పోలీసులకు రూ.50 వేల జరిమానా విధించింది.