గుండె జబ్బులకు యాంజియోప్లాస్టీలు, స్టంట్లు, బైపాస్ సర్జరీలు ఇవన్నీ నూటికి నూరు శాతం అవసరమా ? వీటి పేరుతో కార్పోరేట్ ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు కాజేస్తున్నాయా ? ఈ అనుమానం సామాన్యుడికి కాదు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సదస్సులో వ్యక్తమైన అనుమానాలు. సాక్షాత్తూ ప్రపంచంలో పేరొందిన గుండె వ్యాధుల డాక్టర్లే గుండె జబ్బుల పేరుతో చేస్తోన్న బైపాస్ సర్జరీలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకపోయినా డబ్బుల కోసం వీటిని చేస్తున్నారంటూ శనివారం నాటి సమావేశంలో ఆం దోళన వ్యక్తం చేశారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సదస్సులో హార్ట్ సర్జరీలపై ఒక ప్రత్యేక నివేదికను సమర్పించారు.

సర్జరీలు, స్టంట్ల కన్నా గుండెపోటు నివారణకు మందులు పనిచేసే అవకాశం వున్నప్పటికీ మందులతో నివారణ సాధ్యమైనా, ఎక్కువ మంది వైద్యులు బైపాస్ సర్జరీలకు లేదా స్టంట్లకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. గుండెపోటు మరణాల్లో అధికశాతం బైపాస్ సర్జరీలు, స్టంట్లు పెట్టించుకున్న వారే వున్నారని, మందులతో వైద్యం చేయించుకుంటున్న వారిలో మరణాల శాతం తక్కువని కూడా ఆ నివేదిక తెలిపింది. యాంజినా అనే ఛాతీ నొప్పితో నిరంతరం బాధపడే వారికి లేదా పూర్తిగా రక్తనాళాలు పూడుకుపోయిన వారికి మాత్రమే స్టంట్లు, బైపాస్ విధానాలు బాగా పని చేస్తాయని ఆ నివేదికలో తెలిపారు.

అయితే మందులతో నివారించే గుండె జబ్బులకు కూడా స్టంట్లు, బైపాస్ సర్జరీలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బోస్టన్ యూనివర్శిటీలోని కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ అలీస్ జాకబ్స్ నివేదిక ప్రకారం గుండె వ్యాధుల పేరుతో స్టంట్లు, బైపాస్ సర్జరీలతో జరుగుతున్న మోసం వైద్య రంగంలో నైతిక విలువలను ప్రశ్నించేదిగా వుందని స్పష్టం చేసింది. అసలు కొలస్ట్రాల్ గుండె జబ్బుల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుందోనన్న ప్రశ్న కూడా సంతృప్తికరమైన ముగింపుగా లేదని, ఆ పరిశోధనలు ఇంకా అసంతృప్తిగానే వున్నాయని బర్నింగ్ హ్యామ్ కు చెందిన డాక్టర్ ఇలియంట్ యాంట్ మేన్ పేర్కొన్నారు